‘హీరో’లు మాత్రమే ఐఫోన్లు వాడాలి!

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది, బాలీవుడ్‌ సినిమాల్లోలాగా హాలీవుడ్‌ సినిమాల్లో ఎవరు హీరో, ఎవరు విలన్‌? ఎవరు మంచి వారు? ఎవరు దుష్టులు? అంత సులభంగా కనుక్కోలేం. కొరుకుడు పడని భాష కారణంగానే కాకుండా, కరడుకట్టిన వారు కాకుండా సున్నితమైన విలన్లు ఉండడమూ కారణమే. అయితే ఇప్పుడు వారు వాడుతున్న సెల్‌ఫోన్లను బట్టి ఎవరు హీరో? ఎవరు విలన్‌? అనేది సులువుగా కనుక్కోవచ్చని హాలీవుడ్‌ దర్శకుడు రియాన్‌ జాన్సన్‌ తెలిపారు. హాలీవుడ్‌ చిత్రాల్లో ఐ ఫోన్లు వాడిన క్యారెక్టర్లంతా హీరోలు, మంచివారేనని రియాన్‌ అన్నారు.







సినిమాల్లో మంచి క్యారెక్టర్లు మాత్రమే తమ ఉత్పత్తులను వినియోగించాలని, దుష్ట పాత్రలు తమ ఉత్పత్తులను వినియోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము ఆమోదించబోమని ఆపిల్‌ కంపెనీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమే అందుకు కారణమని రియాన్‌ జాన్సన్‌ చెప్పారు. ఒక్క సినిమాలకే కాకుండా టీవీ సీరియళ్లకు కూడా తమ కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఆపిల్‌ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. సెక్స్‌ అండ్‌ టీవీ, దీ ఫ్యామిలీ గై, క్యాప్టెన్‌ అమెరికా, ది వింటర్‌ సోల్జర్, ఫాస్ట్‌ ఫైవ్‌ సహా పలు టెలివిజన్‌ సీరియళ్లలో, పలు చిత్రాల్లో ఐ ఫోన్లను విరివిగా ఉపయోగించారు. 2001 వరకు అన్ని సినిమాల్లో హీరోలు మాత్రమే తమ ఉపయోగించేవారని, ఆ తర్వాత హీరోలతోపాటు ఇతర పాత్రలు కూడా ఈ ఉత్పత్తులను ఉపయోగించడం మొదలయిందని ఆపిల్‌ కంపెనీ వర్గాలు తెలిపాయి.